DBN TELUGU:- ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఉదయం ఆదిలాబాద్ లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 10.20 గంటలకు నాగ్‌పూర్ నుంచి రానున్న ప్రధానికి గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు.
ఈ క్రమంలో 9.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ చేరుకోనున్నారు. అధికారిక కార్యక్రమాల అనంతరం తిరిగి సీఎం వెళ్లనున్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ సభలో నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రధాని మోదీ ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కచ్‌కంటి నుంచి ఆదిలాబాద్ పట్టణానికి రాకపోకలను మళ్లించారు. పాత సాత్నాల రహదారి నుంచి ఆదిలాబాద్‌కు దారి మళ్లించారు. కేఆర్‌కే కాలనీవాసులు పట్టణంలోకి వచ్చేందుకు మావల పోలీస్ స్టేషన్ మీదుగా తిరుమల పెట్రోల్ బంక్ వైపు రాకపోకలు సాగించాలి. అలాగే పట్టణంలో సోమవారం సభాస్థలి, హెలిప్యాడ్, తదితర ప్రాంతాల్లో డ్రోన్లను పూర్తిగా నిషేధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రధాని సభకు వచ్చే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లను వినాయక చౌక్ వద్ద గల మధుర జిన్నింగ్, గౌతమ్ మోడల్ స్కూల్ వద్ద పార్కింగ్ చేయాలని సూచించారు. సభకు వచ్చే బస్సులను స్థానిక డైట్ కళాశాల మైదానం, రామ్‌లీలా మైదానం, టీటీడీసీ ఎదురుగా ఉన్న ప్రదేశాల్లో పార్కింగ్ చేయాలని పోలీసులు పేర్కొన్నారు.