Type Here to Get Search Results !

ఫ్లాష్ న్యూస్: రైతుబంధు ఎప్పట్నుంచి ఇస్తారో చెప్పాలి...?

DBN TELUGU:- తాము అధికారంలోకి వస్తే... డిసెంబర్‌ 9న రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిందని, ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు ఎప్పట్నుంచి ఇస్తారో ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.





తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు... 'ఎన్నికల ప్రచారం సందర్భంగా... కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతుబంధు ప్రతి ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పారు. అది కూడా డిసెంబర్‌ 9వ తేదీన రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తామని అన్నారు. ఇవాళ డిసెంబర్‌ 9వ తేదీ ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై అసెంబ్లీలో ఏదైనా ప్రకటన చేస్తారని అనుకున్నాం. కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు' అని హరీశ్‌ పేర్కొన్నారు. యాసంగి పంట కు ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని కోరారు. రైతుబంధు ఎప్పుడు వేస్తారో రైతాంగానికి స్పష్టతనివ్వాలని తాము కాంగ్రెస్‌ నాయకులను అడుగుతున్నామని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో యాసంగి పంటలు ప్రారంభమయ్యాయని, తాము ఏడెనిమిదేండ్ల పాటు నవంబర్‌ చివరి వారం నుంచి డిసెంబర్‌ మొదటి వారంలోపు రైతుబంధు వేశామని గుర్తు చేశారు. 


ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు చేసిన మరో వాగ్దానాన్ని కూడా అమలు చేయాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి క్వింటాల్‌కు గిట్టుబాటు ధరతో పాటు, రూ.500 బోనస్‌ ఇచ్చి వడ్లు త్వరగా కొనుగోలు చేయాలని కోరారు. రైతులు రోడ్లపై ధాన్యపు రాశులు ఆరబెడుతున్నారని, తుఫాన్‌ కారణంగా వర్షాలు పడుతుండటంతో ఆ ధాన్యం తడుస్తున్నదని చెప్పారు. ఈ దయనీయ పరిస్థితుల్లో రైతులంతా ప్రభుత్వం ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తుందా? అని ఎదురుచూస్తున్నారని అన్నారు.


మీరు వడ్లు అమ్ముకోవద్దు. మేము అధికారంలోకి రాగానే ప్రతి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తాం, వడ్లు కొనుగోలు చేస్తాం' అని ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెప్పారని హరీశ్‌రావు గుర్తు చేశారు. 'మీరు ప్రకటించిన రూ.500 బోనస్‌ ఎప్పటి నుంచి ఇస్తారు...? బోనస్‌తో కూడిన వడ్ల కొనుగోలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు...? అని రైతుల పక్షాన ప్రశ్నిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వ పెద్దలే వారికి స్పష్టత ఇవ్వాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడే విమర్శలు చేయడం లేదని, ప్రజల పక్షాన, రైతుల పక్షాన స్పష్టత కోసం అడుగుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్‌, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతామధు ఉన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.