DBN TELUGU:- కరీంనగర్ జిల్లాలో బొమ్మకల్ బైపాస్ మార్గంలో రోడ్డు ప్రమాదంలో ఆదివారం రాత్రి ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సిరిమల్ల జ్యోతి(45) పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడమద్దికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు.
కరీంనగర్ మల్కాపూర్కు చెందిన పూర్వ విద్యార్థిని సౌజన్య(24) డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. సౌజన్య పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి సహాయం చేస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి వారిద్దరు ద్విచక్ర వాహనంపై ఎన్టీఆర్ చౌరస్తా నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ వైపు వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు వీరి వాహనాన్ని ఢీకొనడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ రవికుమార్ తెలిపారు.


