DBN TELUGU:- మంచిర్యాల జిల్లాలో చెన్నూరు పట్టణంలో తాంత్రిక పూజలు చేస్తున్న క్రమంలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
అనారోగ్యంతో బాధపడుతున్న బొక్కలగూడెం కాలనీకి చెందిన దాసరి మధు(33) అనే యువకుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల్లో చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. క్షుద్ర పూజలతోనే అనారోగ్యానికి గురయ్యాడని భావించిన యువకుడి కుటుంబ సభ్యులు అతడి ఆరోగ్యం మెరుగుపడేందుకు తాంత్రిక పూజారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు ఆదివారం అస్వస్థతతో ఉన్న ఆ యువకుడిని స్థానిక గోదావరి నది వద్దకు తీసుకెళ్లి అక్కడ పూజలు చేయించారు. ఈ క్రమంలో ఆ యువకుడు సొమ్మసిల్లి పడిపోయి అక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు సోమవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు గోదావరి నదికి తీసుకెళ్లారు. అప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్ కావడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా మృతుడి కుటుంబ సభ్యులు తిరగబడ్డారు. చివరకు వారికి నచ్చజెప్పి యువకుడి మృతదేహానికి నది వద్దే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహానికి అతడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ వాసుదేవరావు తెలిపారు.
