DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 రోజుల పాటు కొనసాగించిన సమ్మెను విరమించుకుంటున్నట్లు అంగన్ వాడీలు ప్రకటించారు.
ఆదివారం మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ లతో జరిగిన చర్చలు సఫలం కావడంతో అంగన్ వాడీల జెఎసి సమ్మెను విరమించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపింది. త్వరలో ప్రకటించే ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ లో అంగన్ వాడీలను చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని మంత్రులు చెప్పారని పేర్కొంది. మధ్యాహ్న భోజనానికి సంబధించిన పెండింగ్ బిల్లులను సైతం ప్రభుత్వం విడుదల చేయడంతో పాటు మిగతా అన్ని సమస్యల పరిష్కారం కోసం నివేదిక అందించాలని సెక్రెటరీని మంత్రులు ఆదేశించారని చెప్పింది. తమ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో.. తమ సమ్మెను నేటితో విరమించుకుంటున్నట్లు అంగన్ వాడీల జెఎసి స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ పై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అంగన్ వాడీల బాగోగులు చూసుకునే విషయంలో కెసిఆర్ అనుకూలంగా ఉంటారని కోరుకుంటున్నామని.. సిఎం కెసిఆర్, మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని పేర్కొంది.