DBN TELUGU:- విహార యాత్ర విషాద యాత్రగా మారిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఉన్న ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన తెలంగాణ వాసుల బృందంలోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
అలాగే మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లిటి కి చెందిన డ్రైవర్ షేక్ సల్మాన్, గొల్లి వైభవ్ యాదవ్‌తో పాటు అర్లి, భీంపూర్, కప్పర్ల, పెండల్‌వాడ, బేలా ప్రాంతాలకు చెందిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్లు కోటేశ్వర్, శివకృష్ణ, శ్యామ్‌లింగా రెడ్డి, సుమన్, యోగేశ్, హరీశ్‌లు మహారాష్ట్రలోని అమరావతి టూర్‌కు వెళ్లారు. ఆదివారం, సోమవారం సెలవులు ఉండటంతో వీరంతా కారులో విహారయాత్రకు బయలుదేరారు. ఆదివారం ఉదయం 8 గంటలకు అమరావతి జిల్లా చికల్‌దరాకు చేరుకున్నారు. భీకరంగా వాన కురుస్తున్న టైంలో చికల్‌దరా ఘాట్ రోడ్డును ఎక్కే క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి 200 మీటర్ల ఎత్తు నుంచి లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ షేక్ సల్మాన్(28), శివకృష్ణ(30), వైభవ్ లక్ష్మణ్(29), కోటేశ్వర్ రావు(27) లు అక్కడికక్కడే చనిపోగా, శ్యామ్‌లింగా రెడ్డి, సుమన్, యోగేశ్, హరీశ్ లు గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తామని తెలిపారు. అలాగే మృతదేహాలను తెలంగాణకు తరలించడానికి మహారాష్ట్ర పోలీసులు, తెలంగాణ రాష్ట్ర అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.