DBN TELUGU:- తనను ప్రేమించ లేదని వేధింపులకు పాల్పడి పురుగుమందు తాగించి ఓ యువతిని హత్య చేసిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
సిర్పూర్(టి) ఎస్సై ధీకొండ రమేష్, స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని వెంట్రాపేట గ్రామానికి చెందిన బూడే దీప (19) ఇంటర్ వరకు చదువుకుని ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులకు వెళ్తుంది. అదే గ్రామానికి చెందిన దంద్రే కమలాకర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఆయనకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆరు నెలలుగా దీపను ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. తన ప్రేమకు దీప నిరాకరించగా కుటుంబ సభ్యులందర్నీ చంపుతానని బెదిరించేవాడని, తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని అసభ్యకర సందేశాలు పెట్టేవాడని తెలిపారు. ఆదివారం ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దీప దగ్గరికి కమలాకర్ వచ్చాడు. తనతో కాకుండా వేరే వాళ్లతో మాట్లాడుతున్నావంటూ ఆమెను కొట్టి ఇంట్లో ఉన్న పురుగుమందు తీసి బలవంతంగా నోట్లో పోశాడు. దీంతో ఆమె బయటకు వచ్చి తనను కాపాడాలని చుట్టుపక్కల వారిని కోరగా స్థానికులు సిర్పూర్(టి) ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీప అన్న రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.