DBN TELUGU:- రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో ప్రముఖ నటుడు రజనీకాంత్ ములాఖత్ అవుతారనే వార్తలు ఇటీవల వచ్చిన సంగతి తెలిసిందే. వాటిపై రజనీకాంత్ తాజాగా స్పందించారు.
చంద్రబాబును తాను కలవాలనుకున్నానని, ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల వెళ్లలేకపోయానని తెలిపారు. కుటుంబ వేడుకల్లో పాల్గొనేందుకు రజనీకాంత్ చెన్నై నుంచి కోయంబత్తూరు బయలు దేరారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయం చేరుకోగానే.. చంద్రబాబుతో ములాఖత్ గురించి మీడియా ప్రశ్నించగా రజనీకాంత్ సమాధానమిచ్చారు. చంద్రబాబు, రజనీకాంత్‌ల మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తనయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ కు రజనీకాంత్ కొన్ని రోజుల క్రితం ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. తన ఆత్మీయ మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ తప్పు చేయరు, చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయనకు రక్ష. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు. చేసిన మంచి పనులు, ప్రజాసేవే ఆయణ్ని బయటకు తీసుకొస్తాయి అని అన్నారు.