DBN TELUGU:- తిరుపతి జిల్లా భాకారాపేటలో దారుణం చోటు చేసుకుంది. చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకారాపేట ఘాట్ అడవులలో మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... రామసముద్రం మండలంలోని చిట్టెంవారిపల్లికి చెందిన కళ్యాణి (15), చౌడేపల్లె మండలంలోని జోగిఇండ్లు (కొత్తిండ్లు)కు చెందిన యుగందర్ (17) కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరూ పుంగనూరు ఎంసివి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. వీరు ప్రేమించుకుంటున్నారన్న విషయం ఇంట్లో తెలియడంతో ప్రేమ వివాహానికి పెద్దలు అడ్డు చెబుతుండడంతో 18వ తేది రాత్రి ఇంట్లో నుంచి పరారయ్యారు. అనంతరం ప్రేమికులు పెళ్లి చేసుకొని తిరుపతి- పీలేరు రహదారిలోని భాకరాపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీప అటవీ ప్రాంతంలో అడవిలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇంచార్జ్ ఎర్రవారిపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు, సీఐ రాజశేఖర్ తెలిపారు.