DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లాలో సినిమా స్టైల్లో కిడ్నాపింగ్ కలకలం రేపుతోంది. భర్త కళ్లముందే భార్యను కిడ్నాప్ చేసి, భర్తపై దాడిచేసి మరీ భార్యను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు.
వివరాల్లోకి వెళితే... ఖమ్మం నగరానికి చెందిన దూలగొండ సన్నీ, కొత్తగూడెం నగరానికి చెందిన గొగ్గెల మాధవి ఇటీవలే ప్రేమవివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో గురువారం తన భార్యను ప్రాజెక్టు వర్కు నిమిత్తం ఖమ్మం నుంచి కొత్తగూడెం కళాశాలకు ఆటోలో తీసుకెళుతుండగా మార్గమధ్యలో కారులో ఛేజ్ చేసిన దుండగులు ఆటోను నిలిపివేశారు.
ఆపై యువకుడిపై దాడి చేసి యువతిని బలవంతంగా కార్లో ఎత్తుకెళ్లారు. కులాంతర ప్రేమవివాహం కారణంగానే తనపై దాడి చేసి తన భార్యను కిడ్నాప్ చేశారని బాధిత యువకుడు ఆరోపించారు. ఈ సందర్భంగా తనకూ, తన భార్యకు ప్రాణహాని ఉందంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కిడ్నాప్ అయిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.