Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్:- ఆగస్టు 18న బీఆర్ఎస్ తొలి జాబితా...!

DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 18న బీఆర్ఎస్ తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.



- 75 నుంచి 105 మందితో ఒకేసారి ప్రకటన- పార్టీ ప్రాధాన్యతలు.. అవసరాలే ముఖ్యం.

- బలాబలాలు, గెలుపోటముల మేరకే సర్దుబాట్లు.

- టిక్కెట్లపై బీఆర్ఎస్ ఏమ్మెల్యేలకు గులాబీ బాస్ స్పష్టత.


- ఆగస్టు 18న బీఆర్ఎస్ తొలి జాబితా విడుదలకు సిద్ధం.


'వ్యక్తులు కాదు.. పార్టీ ముఖ్యం.. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిష్ట, మనోభావాలు కాదు.. ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగరేయటం ముఖ్యం…' అని కారు సారు, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో…పార్టీ ప్రాధాన్యతలు, అవసరాల ప్రాతిపదికనే సీట్ల కేటాయింపు ఉంటుందంటూ ఆయన వారికి చెబుతున్నట్టు సమాచారం. అదే సమయంలో ఎంత సీనియర్ అయినా, జూనియర్ అయినా పార్టీ పట్ల విశ్వాసం, విధేయత కలిగున్న వారికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తామంటూ ఆయన కుండబద్ధలు కొడుతున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి అయినా, అనుభవమున్న ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో అతడి బలాబలాలు, 'సామర్థ్యాలు' గెలుపోటములు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఇటీవల నిర్వహిస్తున్న అంతర్గత సమావేశాల్లో ఆయన చెప్పినట్టు తెలిసింది. ఇలాంటి ప్రాతిపదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందంటూ స్పష్టం చేసినట్టు వినికిడి. 

బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్తోపాటు టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన వారు ఎక్కువగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో పలువురికి మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు, ఇతర నామినేటెడ్ పోస్టులనిచ్చినా పదవుల కోసం ఎదురు చూస్తున్న వారి జాబితా ఎక్కువగానే ఉంది. దీంతో పాటు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఐదేండ్ల నుంచి ఎలాంటి పదవుల్లేక ఖాళీగా ఉన్నారు. వీరందరూ ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్నారు. 'సారు ఈసారి కచ్చితంగా తమకే టిక్కెట్ ఇచ్చి న్యాయం చేస్తారు…' అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటు ఓడిపోయిన పాత కాపులు, అటు ఇతర పార్టీల్లోంచి వచ్చి గులాబీ కండువా కప్పుకున్న వలస నేతలు, వీరితోపాటు ఈసారి ఎలాగైనా టిక్కెట్ దక్కించుకుని, గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న యువ నేతలు, ఆశావహులతో 'కారు'కు లోడెక్కువైంది. ఇలా సామర్థ్యానికి మించి నిండిపోయిన బండిని వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడపాలంటే కొన్ని షరతులు, నిబంధనలు, కఠిన నిర్ణయాలు తప్పబోవంటూ గులాబీ దళపతి స్పష్టం చేస్తున్నారట.

ఈ క్రమంలో ఒకటికి, రెండు మూడు సార్లు క్షేత్రస్థాయిలో సర్వేలు చేయించిన ఆయన… ప్రతీ నియోజకవర్గానికి సంబంధించిన స్పష్టమైన సమాచారంతో సీట్ల కేటాయింపు చేయబోతున్నారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ సాగుతున్నది. ఆ రకంగా 75 నుంచి 105 మంది జాబితాను సీఎం ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు మూడు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో… అవి ముగిసిన వెంటనే ఆయన మరోసారి అభ్యర్థుల బలాబలాలను మరింతగా బేరీజు వేయనున్నారనీ, అప్పటి పరిస్థితులకనుగుణంగా ఆ నెలలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ కుదిరితే ఆగస్టు 18న ఆ లిస్టును ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.