DBN TELUGU:- తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మృతిపట్ల ముఖ్యమంత్రి సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని కొనియాడారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.