DBN TELUGU CHANNEL:-
- ఇక్కడే పుట్టి, చదివి, బోధించి, నేడు... హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్.
- శంకర్ సార్ ప్రస్థానం.. ఆద్యంతం అద్భుతం.
- కళాశాలలో మంగళవారం బాధ్యతల స్వీకరణ.
- బాధ్యతాయుతంగా పనిచేస్తా: ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్.
-- బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్ గా డాక్టర్ కాంపల్లి శంకర్ ను నియమిస్తూ తెలంగాణ కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఏ శ్రీదేవసేన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్ లో డాక్టర్ కాంపల్లి శంకర్ ఎఫ్. ఏ. సి. ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇదే కళాశాలలో కామర్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ కాంపల్లి శంకర్ ను హెడ్ అఫ్ ది ఇన్స్టిట్యూట్ పోస్ట్ వరించడం విశేషం. ఈ సందర్భంగా కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు ప్రిన్సిపాల్ ను పుష్పగుచ్చాలతో అభినందించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.
--ఇక్కడే జననం, విద్యాభ్యాసం, ఉద్యోగం, ఇప్పుడు.. అత్యున్నత స్థానం--
డాక్టర్ కాంపల్లి శంకర్ బెల్లంపల్లిలో పుట్టి, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసించి, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకమై... ఇప్పుడు ఇదే కళాశాలలో ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టడం విశేషం. పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో రైల్వే ఉద్యోగి ఎల్లయ్య-మల్లమ్మ దంపతులకు మూడవ మగ సంతానంగా జన్మించిన కాంపల్లి శంకర్ ప్రాథమిక విద్య రైల్వే అప్పర్ ప్రైమరీ స్కూల్ హైస్కూల్ విద్య వరకు స్థానిక సిఎస్ఐ పాఠశాలలో, ఇంటర్మీడియట్ బెల్లంపల్లి జూనియర్ కళాశాలలో, డిగ్రీ బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదివారు. అనంతరం ఉన్నత విద్య కోసం నిజామాబాద్ కు వెళ్లి అక్కడి తెలంగాణ విశ్వవిద్యాలయ క్యాంపస్ లో ఎంకాం ఈ-కామర్స్ పూర్తి చేశారు. అనతరం ఎంఏ ఇంగ్లీష్, బి . ఎడ్.బీ.పీఈడీ, జ్యోతిర్ వాస్తు శాస్త్రంలో తెలుగు విశ్వవిద్యాలయం పీజీ డిప్లమా చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ యాదగిరి పర్యవేక్షణలో "ముద్ర" అనే అంశంపై పిహెచ్డి చేశారు. దేశంలోనే ఈ తరహా అంశాన్ని ఎంచుకొని పరిశోధన చేసిన వారిగా గుర్తింపు పొందారు. తద్వారా 2022లో తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా అందుకున్నారు. ఎన్నో పరిశోధన పత్రాలు, కొన్ని పుస్తకాలు రాశారు. 2008లో కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్ గా నియమితులైన కాంపల్లి శంకర్ ఉట్నూర్, చెన్నూరు తదితర ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేసి 2018లో స్వస్థలమైన బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ క్రమంలో 2023 మేలో రెగ్యులరైజ్ అయ్యారు. సంవత్సరం తర్వాత ప్రస్తుతం ఇప్పుడు చదువుకున్న కళాశాలలోనే ప్రిన్సిపాల్ గా నియమితులయ్యారు. ఇది తనకెంతో అనిర్వచనీయ అనుభూతిని కలిగిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.
-- పేరుపేరునా ధన్యవాదాలు--
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ మాట్లాడుతూ... తాను ప్రిన్సిపల్ గా విద్యార్థులకు, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు. ప్రిన్సిపల్ బాధ్యతలు ఇచ్చినందుకుగాను కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఏ శ్రీ దేవసేన మేడం కి, జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్, రీజినల్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ బాల భాస్కర్, అసిస్టెంట్ డైరెక్టర్లు విష్ణు ప్రియ, రాజశేఖర్ , అకాడమిక్ సెల్ వారికి, కమిషనర్ ఆఫీసు సిబ్బంది మరియు బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు, లెక్చరర్లకు, కాంట్రాక్టు, అతిధి, అధ్యాపకులకు, నాన్ టీచింగ్ సిబ్బందికి, అందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా తన గురువులు, భవిష్యత్తు మార్గదర్శకులు ప్రొఫెసర్ డాక్టర్ మాదారపు యాదగిరి, ప్రొఫెసర్ డాక్టర్ జి .రాంబాబు, మంచిర్యాల ఐడి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి చక్రపాణి, సీనియర్ లెక్చరర్ మేకల గోపాల్, ఓల్లాల రజనీకాంత్ కు హృదయపూర్వక ధన్యవాదాలు వ్యక్తం చేశారు.