DBN TELUGU:- తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికు చిత్తశుద్ధి ఉంటే కొత్త ఉద్యోగాలను భర్తీ చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ అన్నారు.
మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రేవంత్ రెడ్డి మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని అన్నారు. అబద్ధాల పునాదుల మీద రేవంత్ పాలన చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సమర్థుడైతే కొత్తగా ఉద్యోగాలు సృష్టించాలని సూచించారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చానని అనడం రేవంత్ నయవంచనకు పరాకాష్టగా మారిందని అన్నారు. ఉద్యోగాల ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఆధిపత్య ధోరణితో మాట్లాడుతూ బీసీలను అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీని అధికారంలో నుంచి దించేయాలని చూస్తుంటే రేవంత్ ఆయనే ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీల మధ్య తెలంగాణలో చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. గుజరాత్ మోడల్ అబద్దాల మోడల్ అని కాంగ్రెస్ అధిష్ఠానం అంటే... రేవంత్ దాన్ని గొప్ప మోడల్ అంటున్నారని విమర్శించారు. మూడోసారి మోదీని ప్రధాని చేయాలని రేవంత్ తపిస్తున్నారని దాసోజ్ శ్రావణ్ అన్నారు.