DBN TELUGU:- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో తల్లిదండ్రులతో పాటు తనయుడు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాలు చూసుకుంటే భీమిని మండలంలోని వెంకటాపూర్ కు చెందిన కోట తిరుపతి (40), తిరుమల (35), కోట అంజేష్(18) ముగ్గురు మోటార్ సైకిల్ మీద తాండూరు మండలంలోని బోయపల్లి గ్రామంలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి ఇంటికి బైక్ పై వస్తుండగా బెల్లంపల్లి కన్నాల పెట్రోల్ బంక్ సమీపంలోని వెనుక నుంచి వేగంగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తిరుపతి, తిరుమల అక్కడికక్కడే మృతిచెందారు. కొడుకు అంజేష్ తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ లారీ క్యాబిల్లో ఇరుక్కుని దాదాపు కిలోమీటరు వరకు ఈడ్చుకుంటూ వచ్చింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన అంజేశ్ బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మంచిర్యాలకు రిఫర్ చేశారు. ఆసుపత్రికి వెళ్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన సంఘటన అందరిని కలచివేసింది. మృతుల బంధువుల రోధనలతో హాస్పిటల్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్సలుద్దీన్, వన్ టౌన్ ఎస్హెచ్ఓ దేవయ్య, ఎస్సై ప్రవీణ్ చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.