DBN TELUGU:-
- ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతున్నాం.
- ఆదిలాబాద్ ఆర్ సి ఓ కొప్పుల స్వరూప రాణి.
- ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించిన ఆర్ సి ఓ.
- విద్యార్థుల ప్రగతి వివరించిన ప్రిన్సిపల్ ఐనాల సైదులు.
- విద్యార్థుల అభివృద్ధిలో పాలుపంచుకుంటామన్న పేరెంట్స్ కమిటీ.
రానున్న పరీక్షల దృష్ట్యా ఒత్తిడి లేకుండా ఉత్తమమైన ప్రణాళికతో సాంఘిక సంక్షేమ గురుకులాలు ముందుకు పోతున్నాయని ఆదిలాబాద్ రీజియన్ సంక్షేమ గురుకులాల ప్రాంతీయ సమన్వయ అధికారి కొప్పుల స్వరూప రాణి అన్నారు. గురువారం బెల్లంపల్లి సిఓఈ లో నిర్వహించిన ఇంపాక్ట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఐనాల సైదులు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న పలు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్రులు తమ విద్యార్థుల ప్రగతి పట్ల విద్యాసంబంధ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నది ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు చర్చించి తగిన విధంగా పిల్లలను ప్రోత్సహించాలన్నారు. ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో సహకరించి పిల్లల భవిష్యత్తుకు చక్కటి బాటను వేయాలని కోరారు.
ఈ సందర్భంగా పలు పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆమె బహుమతులు అందజేశారు. అనంతరం ప్రిన్సిపల్ ఐనాల సైదులు సంక్షేమ గురుకులాల్లో నిర్వహిస్తున్న విద్యాసంబంధ కార్యక్రమాల ప్రత్యేకతను తల్లిదండ్రులకు వివరించారు. అదేవిధంగా విద్యార్థుల ప్రగతి నివేదికలను తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా తెలియజేశారు. అనంతరం పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు పుదారి నగేష్ గౌడ్ మాట్లాడుతూ సి ఓ ఈ అభివృద్ధిలో పేరెంట్స్ కమిటీ పాలుపంచుకుంటుందని విద్యార్థుల భవిష్యత్తుకు తమ వంతు పాత్రను పోషిస్తామని అన్నారు. కార్యక్రమంలో ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కోట రాజ్ కుమార్, జెవిపి కొక్కుల రాజేశ్వర్, ఉపాధ్యాయులు శ్యాంసుందర్ రాజు, షిండే దత్త ప్రసాద్, వరమని ప్రమోద్ కుమార్, హారిక, ఎండి కౌసర్, స్రవంతి, ముడిమడుగుల మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.