Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్: మొదలుకానున్న పంచాయతీ పోరు.

DBN TELUGU:-


- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న పంచాయతీ ఎన్నికల సందడి.


- త్వరలో అధికారులకు ప్రారంభం కానున్న శిక్షణ తరగతులు.


- కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసిన ఎన్నికల సంఘం.






తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మరోసారి గ్రామ పంచాయితీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. సర్పంచ్ ఎన్నికలకు అతి త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కసరత్తు ప్రారంభించాలని సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు వెళ్లాయి. కిందటిసారి సర్పంచ్ ఎన్నికలు 2019 జనవరిలో 3 దశల్లో జరిగాయి. గ్రామాల్లో ఫిబ్రవరి 1 నాటికి సర్పంచ్ సహా కొత్త కార్యవర్గం కొలువుదీరింది. వీరి పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియనుంది. నిబంధనల ప్రకారం... ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. పదవీ కాలం ముగియడానికి 3 నెలల ముందుగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇప్పటికే ఈ ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.  


అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడం... ఈరోజు కొత్త శాసనసభ కొలువుదీరనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు సర్పంచ్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారుల నియామకం, ఎన్నికల విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలను ప్రారంభించాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం సూచించింది. 


రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం అశోక్ కుమార్ పేరుతో డిసెంబర్ 4న ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ కార్యదర్శులు ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్లకు సంబంధించిన రిజర్వేషన్లపై వివరాలు పంపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు పదేళ్లకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం 2019లో చట్టం చేసింది.ఈ నేపథ్యంలో కిందటిసారి రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొలువుదీరే కొత్త ప్రభుత్వం రిజర్వేషన్లను మార్చాలని నిర్ణయం తీసుకుంటే, అధికారులు నిర్ణీత సమయంలో కొత్త రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు అందిస్తే.. తప్ప రిజర్వేషన్లు మారే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.