DBN TELUGU:- గాంధీ జయంతిని పురస్కరించుకుని, సీఎం జగన్ నిరంకుశ విధానాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ సత్యమేవ జయతే పేరుతో ఒక రోజు నిరాహార దీక్షలకు సిద్ధమయింది.
ఆ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదివారం ఓ ప్రకటన చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతూ, రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారు. జగన్ నియంతృత్వ పాలనను నిరసిస్తూ సోమవారం రాజమండ్రి కేంద్ర కారాగారంలో పార్టీ అధినేత చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలో నిరాహార దీక్ష చేపడతారు. ఈ దీక్షలకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు మహాత్మాగాంధీకి నివాళులర్పించి, నిరాహార దీక్షలు చేయాలి. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నిరాహార దీక్షల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలి అని అచ్చెన్న పిలుపునిచ్చారు. కాగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీలో నిరాహార దీక్ష చేయనున్నారు. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ నివాసంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగే దీక్షలో టీడీపీ ఎంపీలు పాల్గొంటారని లోకేశ్ తెలిపారు.