DBN TELUGU:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో తెలుగుదేశం పార్టీ సోమవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.
దీంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి మండల కేంద్రంలోనూ ఆదివారం సాయంత్రం నుంచే దీన్ని అమలు చేయాలని జిల్లాల ఎస్పీలకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎక్కడా ర్యాలీలు, నిరసనలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీలను పోలీసుశాఖ ఆదేశించింది. పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఏపీఎస్పీ పోలీసులను అవసరం మేరకు వినియోగించుకోవాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎస్పీలకు సూచించినట్లు తెలిసింది. ఆదివారం ఉదయం చంద్రబాబును విజయవాడ కోర్టుకు తీసుకెళ్లినప్పటి నుంచి పోలీసులు పూర్తి స్థాయిలో అలర్టయ్యారు. విజయవాడ పోలీసులు కోర్టు పరిసరాలను పూర్తిగా అదుపులోకి తీసుకోవడంతోపాటు టీడీపీ నేతల ఇళ్లు, ప్రధాన కూడళ్లలో మోహరించారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతను జైలుకు తరలిస్తే ఎటువంటి భద్రతా సమస్య లేకుండా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.