DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ పని అయిపోయిందని, ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్ అయిన బిఆర్ఎస్ తోనే కాంగ్రెస్ కు పోటీ అని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఖమ్మంలో నిర్వహించిన జన గర్జన సభలో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇటీవలే కర్ణాటకలో బీజేపీని ఓడించామని, తెలంగాణలో ఆ పార్టీ బీ టీమ్‌నూ ఓడిస్తామని ప్రకటించారు. ఖమ్మంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తెలంగాణ జనగర్జన సభకు రాహుల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని, పలువురు ఇతర నేతలను కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు. సభకు భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతి అక్రమాలు, కుంభకోణాల సమాచారమంతా కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద ఉందని రాహుల్ అన్నారు. లిక్కర్ కుంభకోణంతో పాటుఇతర అక్రమాల వివరాలన్నీ కేంద్రం వద్ద ఉన్నాయని, అందుకే కేసీఆర్ ప్రధాని ముందు తలొగ్గారని ఆరోపించారు. అలాగే బీజేపీకి బిఆర్ఎస్ బీ టీమ్‌గా మారారన్నారు. బీఆర్‌ఎస్ అంటే.. బీజేపీ రిష్తేదార్ (బంధుత్వ) సమితి అని అభివర్ణించారు. దేశంలో ప్రజల మధ్య పెంచుతున్న విద్వేషాన్ని ఆపాలని, ప్రేమను పంచాలనే లక్ష్యంతో చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఖమ్మం ప్రజలు తనకు ఎంతో సహకరించారని రాహుల్ తెలిపారు. ఇక్కడి నుంచి వచ్చి ఎంతోమంది యాత్రలో పాలుపంచుకున్నారని గుర్తు చేసుకున్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘‘యాత్రలో దేశాన్ని కలిపే విషయాలనే మాట్లాడాను. దేశాన్ని విభజించాలన్నది వారి (బీజేపీ) ఆలోచన అయితే.. దేశాన్ని కలపాలన్నది నా ఆలోచన. మొత్తం దేశం నా యాత్రను సమర్థించింది. హింస, విద్వేషాన్ని ప్రబలనివ్వబోమని దేశం చెప్పింది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీకి గడ్డ. మీ ఆలోచనలు, మనసుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీ అందరికీ నా ప్రత్యేక అభినందనలు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి పాదయాత్ర ముగింపు సందర్భంగా బట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఘనంగా సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
