Type Here to Get Search Results !

బ్రేకింగ్ న్యూస్:- పిల్లలను హత్య చేసిన తండ్రి...!

DBN TELUGU:- భార్యపై కోపంతో కన్న బిడ్డలను చంపుకున్నాడో తండ్రి..! భార్య తనకు దూరంగా పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోందనే కసితో రగిలిపోయిన భర్త, పథకం ప్రకారం ఆ చిన్నారులు చదువుకుంటున్న బడికి వెళ్లాడు. 



ఇంటికెళదాం పదండి అంటే.. అభంశుభం తెలియని పిల్లలు అతడి వెంట నడిచారు...! ఇంట్లో ఆ ఇద్దరు చిన్నారులను గొంతు పిసికి చంపేశాడా తండ్రి. వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లాలోని మధిర మండలంలోని రాయపట్నం గ్రామంలో ఈ దారుణం జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పార్శపు శివరామ్‌ గోపాల్‌ తొమ్మిదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మార్తమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు రామకృష్ణ (7), ఆరాధ్య(5) ఉన్నారు. తనతో భర్త తరచూ గొడవ పడుతుండటంతో మార్తమ్మ, భర్తను వదిలేసి పిల్లలను వెంటబెట్టుకొని అదే ఊర్లోని పుట్టింటికి వెళ్లింది. అక్కడే ఉంటూ పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోంది. రామకృష్ణ మూడో తరగతి, ఆరాధ్య ఒకటో తరగతి చదువుతున్నారు. సోమవారం తన తల్లి బంధువుల ఊరు వెళ్లడంతో శివరామ్‌గోపాల్‌ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సాయంత్రం బడి నుంచి పిల్లలను తీసుకొని శివరామ్‌గోపాల్‌ ఇంటికి వచ్చాడు. ఇద్దరినీ చంపేసి.. మృతదేహాలను దుప్పట్లో చుట్టాడు..! ఇంట్లో లోపలివైపు నుంచి తలుపులు బిగించి.. అడ్డంగా బీరువా పెట్టి, మరో గుమ్మం నుంచి పరారయ్యాడు. సాయంత్రం ఆరవుతున్నా బడి నుంచి పిల్లలు ఇంటికి రాకపోవడంతో మార్తమ్మ ఆందోళన చెందింది. పిల్లల కోసం ఆమె వెతుకుతుండగా శివరామ్‌గోపాల్‌ పిల్లలను తన ఇంటికి తీసుకువెళ్లాడని స్థానికులు చెప్పడంతో అక్కడికి వెళ్లింది. స్థానికుల సాయంతో తలుపులను నెట్టుకుని లోపలికి వెళ్లి చూసి షాక్‌ అయింది. అప్పటికీ ఇంకా బతికి ఉన్నారేమోనన్న ఆశతో ఆస్పత్రికి తరలించగా.. చనిపోయారని వైద్యులు చెప్పడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. చిన్నారులను చంపిన శివరామ్‌గోపాల్‌ను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివరామ్‌గోపాల్‌ ఇటీవల ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లి రెండురోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చాడు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.