DBN TELUGU:- దోమలగూడ గ్యాస్ లీకేజ్ ఘటనలో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో పద్మ, ధనలక్ష్మి, అభినవ్ శుక్రవారం ఉదయం మృతి చెందారు.
దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోమలగూడ రోజ్ కాలనీలో ఈ నెల 11న పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకేజీ అయి మంటలు అంటు కోవడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. అయితే గాయపడిన ధనలక్ష్మి కూతురు శరణ్య చికిత్స పొందుతూ ఈనెల 12న మృతి చెందింది. ఈ రోజు తీవ్రంగా కాలిన గాయాలపాలైన పద్మ (53), ఆమె కూతురు ధనలక్ష్మి (28), ధనలక్ష్మి కుమారుడు అభినవ్ (7)లు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్యాస్ లీకేజీ అయి మంటలు అంటుకున్న ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.